కూర్చున్న చోటు నుంచి కదలకుండా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు

Get Inspired

Loading...

కూర్చొని కోట్లు సంపాదిస్తున్నారు!

ఎప్పుడూ బయటి ప్రపంచంలో కనిపించరు… అయినా కోట్ల మంది వాళ్లకు అభిమానులు. హాలీవుడ్‌ స్థాయి భారీ చిత్రాలేం తీయరు… అయినా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్లే యూట్యూబ్‌ స్టార్లు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా కోటీశ్వరులు కావడం ఎలాగో ప్రపంచానికి నేర్పిస్తున్నారు. తాజా యూట్యూబ్‌ గణాంకాల ప్రకారం వాళ్లలో తొలి పది మంది సంపన్నులే వీళ్లు…

chudu

1. ఛానల్‌ పేరు: డిస్నీ టాయ్‌ కలెక్టర్‌
ఆదాయం: ఏడాదికి 40కోట్ల రూపాయలు
అన్‌బాక్సింగ్‌… ఈ మధ్య యూట్యూబ్‌లో పాపులర్‌ అవుతోన్న ట్రెండు. కొత్త వస్తువులను కొని వాటిని తెరుస్తూ అందులో ఒక్కో భాగం గురించి వివరించడమే ‘అన్‌బాక్సింగ్‌’ అంటే. డిస్నీ టాయ్‌ కలెక్టర్‌ ఛానల్‌లో ఓ అమ్మాయి డిస్నీ సంస్థ తయారు చేసే బొమ్మలను తెరుస్తూ వాటి గురించి వివరిస్తుంది. మొహం కనిపించకుండా చక్కగా మెనిక్యూర్‌ చేసిన చేతులను చూపిస్తూ, హస్కీ గొంతుతో ఆ బొమ్మల గురించి ఆమె వివరించే విధానం యూట్యూబ్‌ అభిమానులను కట్టిపడేస్తోంది. ఇప్పటికీ ఆమె ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. యూట్యూబ్‌ మెసేజ్‌లకు కూడా స్పందించని ఆమె వీడియోలను నెలకు సగటున పది కోట్ల మంది చూస్తున్నారు.

2. ఛానల్‌ పేరు: ప్యూ డీ పై
ఆదాయం: ఏడాదికి 37కోట్ల రూపాయలు
యూట్యూబ్‌ గురించి మాట్లాడాల్సి వస్తే మొదట గుర్తొచ్చే ఛానల్‌ ఇది. స్వీడన్‌కు చెందిన ఫెలిక్స్‌ అర్విద్‌ అనే కుర్రాడు వీడియోగేమ్‌లు ఆడుతూ సరదాగా వాటికి కామెంటరీ చెప్తూ ఆ వీడియోలను యూట్యూబ్‌లో పెట్టాడు. ఓ వైపు ఆటల్లో స్టేజీలు ఎలా దాటాలో చెప్పడంతో పాటూ సరదాగా కామెంటరీ చెప్పే విధానం వీక్షకులు బాగా నచ్చేసింది. సుమారు మూడు కోట్ల మంది ప్రతిరోజూ అతడి వీడియోలు చూస్తారు. ఇప్పటివరకూ ప్యూడీపై వీడియోలకు నాలుగు వందల కోట్లకు పైగా హిట్లు వచ్చాయి.

3. ఛానల్‌ పేరు: బ్లూ జెఫోస్‌
ఆదాయం: ఏటా సుమారు రూ.36కోట్లు
లూయిస్‌, సైమన్‌ అనే ఇద్దరు కుర్రాళ్లు ఉపాధిగా ఎంచుకుని మొదలుపెట్టిన ఈ ఛానల్‌ కూడా వీడియోగేమ్స్‌పైన ఆధారపడి నడిచేదే. పేరున్న వీడియోగేమ్‌ పాత్రలలానే వేషాలు వేసుకున్న యువకులు ఆటలోని లోపాలను సరదాగా వివరిస్తూ, ఏ స్టేజీలో ఎలా ఆడాలో చూపిస్తారు. ప్రధానంగా యుద్ధ క్రీడలనే ఎంచుకుని వాళ్లే యుద్ధం చేస్తునట్లు నటిస్తూ కామెంటరీ చెప్పే ఆ వీడియోలకు 70 లక్షల మందికి పైగా వినియోగదారులు.

4 ఛానల్‌ పేరు: స్మాష్‌
ఆదాయం: ఏడాదికి సుమారు రూ.35కోట్లు
ఆంటోని, ఇయాన్‌ అనే స్నేహితులు మొదలుపెట్టిన స్మాష్‌, యూట్యూబ్‌ మొట్టమొదటి ఛానల్స్‌లో ఒకటి. ఇంటర్నెట్‌లో పాపులర్‌ అయిన అంశాలకు పేరడీలు చేయడం, సినిమాల్లోని సన్నివేశాలకు సొంత డబ్బింగ్‌ చెబుతూ హాస్యం పండించడం వీరి ప్రత్యేకత. ఇప్పటివరకూ 470 కోట్ల హిట్లు అందుకున్న ఆ ఛానెల్‌ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 2.7కోట్లు.

5. ఛానల్‌ పేరు: జెన్నా మార్బుల్స్‌
ఆదాయం: ఏడాదికి 26.6కోట్లు
అమెరికాకు చెందిన జెన్నా అనే అమ్మాయి ఓసారి ‘మీరు అందంగా ఉంటారని ఎదుటివాళ్లకు భ్రమకలిగించడం ఎలా’ అనే వీడియోను అప్‌లోడ్‌ చేసింది. దాన్ని తొలివారంలోనే 53 లక్షల మంది చూశారు. అప్పట్నుంచీ ‘నచ్చని వాళ్లని దూరం పెట్టడం ఎలా?’, ‘అబ్బాయిలు వేటి గురించి అబద్ధం చెబుతారు’… యువతను ఆకర్షించే ఇలాంటి అంశాలతో వీడియోలను ప్రతి బుధవారం అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ ఛానల్‌కు కోటీ నలభైలక్షల మంది వినియోగదారులు.

6. ఛానల్‌ పేరు: టాబీ గేమ్స్‌
ఆదాయం: ఏడాదికి సుమారు 26.2 కోట్లు
ప్రపంచంలో నిత్యం జరుగుతోన్న అన్యాయాలకు వ్యతిరేకంగా వ్యంగ్యంగా ర్యాప్‌ సాంగ్స్‌ రాసి వాటిని పాడుతున్న వీడియోలను యూట్యూబ్‌లో పెట్టడం మొదలుపెట్టాడు టాబీ టేలర్‌ అనే విద్యార్థి. క్రమంగా పాపులారిటీ పెరిగి టీవీ కార్యక్రమాలూ, సినిమాల్లోనూ కనిపించాడు. అతడి యూట్యూబ్‌ ఛానల్‌కు కోటిన్నర మంది అభిమానులు.

యూట్యూబ్‌లో సంపాదన పరంగా ఏడో స్థానంలో ఉన్న రే విలియం జాన్సన్‌ ఆదాయం ఏడాదికి సుమారు పాతిక కోట్ల రూపాయలు. కొలంబియా విశ్వవిద్యాలయంలో ‘లా’ చదువుతున్న ఇతడు ఇంటర్నెట్‌లో ఆ వారం ఎక్కువ ఆదరణ పొందుతోన్న వీడియోలకు తనదైన శైలిలో వ్యాఖ్యానం జోడిస్తూ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తాడు. ఎనిమిదో స్థానంలో ఉన్న రిచర్డ్‌ విల్సన్‌ ఆదాయం ఏడాదికి సుమారు 22 కోట్ల రూపాయలు. ‘ఉబర్‌ హెక్సర్‌నోవా’ ఛానల్‌ నిర్వహించే రిచర్డ్‌ కూడా టీవీ షోలూ, ఆటల పైన వ్యంగ్యంగా కామెంటరీ చెబుతుంటాడు. తొమ్మిదో స్థానంలో ఉన్న డాన్‌ బాజిమర్‌ ‘ఎనాయింగ్‌ ఆరెంజ్‌’ ఛానెల్‌ ద్వారా సంపాదిస్తోన్న మొత్తం 21 కోట్లు. యానిమేషన్‌ ద్వారా మాట్లాడే నారింజ పండును సృష్టించి అది వేరే పండ్లను ఏడిపిస్తున్నట్లూ, రకరకాల వీడియోగేమ్‌ల లోపలికి ఆ నారింజ ప్రవేశించినట్లూ కథలు అల్లుకొని వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో పెడతాడు. సొంతంగా కామెడీ స్కిట్‌లను రూపొందించే ‘కాలేజ్‌ హ్యూమర్‌’ ఛానల్‌ ఆదాయం కూడా ఏటా 20కోట్ల రూపాయల పైమాటే. జోష్‌, రిక్కీ వ్యాన్‌ అనే స్నేహితులు దీనికి అధినేతలు.

మొత్తమ్మీద యూట్యూబ్‌ ద్వారా అత్యధిక ఆదాయం పొందుతోన్న తొలి పదిమందీ కలిపి ఏడాదిలో సంపాదిస్తున్న మొత్తం సుమారు 290కోట్ల రూపాయలు. మరో విశేషం ఏంటంటే… వీళ్లందరి సగటు వయసు 29ఏళ్లే. కాబట్టి మీకూ ఏవైనా సృజనాత్మక ఆలోచనలుంటే వెంటనే ఓ ఛానల్‌ తెరిచేయండి. సూపర్‌ స్టార్లు అయిపోండి.

Loading...
Loading...

Share This Article

Leave a Reply